అతి మ‌హా సౌరం

అతి త్వర‌లో హైద‌రాబాద్ లో నిర్వహ‌ణ‌

Sunday 28 July 2013

మీ పేరు ప్రాధాన్యం మీకు తెలుసా..!

ప్రతీ వ్యక్తికి త‌న పేరు అంటే చాలా ఇష్టం. ఆ పేరుతో అందరితోనూ పిలిపించుకొంటూ ఉంటారు.ఆ పేరుతో పిలిచిన‌ప్పుడ‌ల్లా తెలీకుండానే శ‌రీరంలోని నాడీ వ్యవ‌స్థ స్పందిస్తు ఉంటుంది. అందుకే పేరుకి స‌నాత‌న ధ‌ర్మంలో అంత‌టి ప్రాధాన్యం ఉంటుంది.
శిశువు జ‌న్మించాక కొద్ది రోజుల‌కు (11 రోజుల‌కు లేదా కుటుంబ సంప్రదాయాన్ని బ‌ట్టి) నామ‌క‌ర‌ణం చేస్తారు. ఈ నామ‌క‌ర‌ణానికి ప్రాధాన్యం ఉంటుంది.
**జాతానంత‌ర మేవ నామ‌క‌ర‌ణ‌మ్ త్వేకాద‌శా హేస్ఫుటం
పుత్ర స్యైవ స‌మాధ‌రంతు యువ‌తేహ‌స్త్ర కార్యం త‌తో వ్యత్యయం
శుద్ధి ర్జాత‌క వ‌చ్ఛనామ్ని స‌క‌లై స్తత్ ద్వాద‌శే షోడ‌శే
ద్వా వింశై వ్యధ వింశ కేహ్ని విహితం జాతి వ్యవ‌స్థాం వినా **
అని పూర్వ కాలామృతం అనే అధ్భుత గ్రంధం లో చెప్పడ‌మైన‌ది. అంటే జాత క‌ర్మ త‌ర్వాత జ‌న్మ న‌క్షత్ర పాదాన్ని బ‌ట్టి పేరుని ఎంచుకోవాలి. ఈ పేరుతోనే శిశువు వృద్ధి చెంది ఆ పేరుని నిల‌బెడ‌తారన్న మాట ఉంది. మ‌గ‌శిశువుకి స‌రి సంఖ్యలో, ఆడ పిల్లకు బేసి సంఖ్య లో పేరు పెట్టడం ఆన‌వాయితీ. శ‌బ్దాన్ని బ‌ట్టి న‌క్షత్ర ప‌రంగా ఉండే ఆయా విలువ‌లు ఆపాదించ‌టం అవుతుంద‌ని న‌మ్మిక‌.

భార‌తీయ స‌మాజంలో దేవుళ్ల పేర్లు - పిల్లల‌కు పెట్టే సాంప్రదాయం ఉంది. ఆ పేరుని ఇంట్లో ప‌దే ప‌దే ఉచ్ఛరించ‌టం తో ఇంట్లో వారంద‌రికీ శుభం క‌లుగుతుంద‌ని చెబుతారు. అంతే గాకుండా భ‌గ‌వంతుని పేరు పెట్టుకొని మంచి మార్గంలో న‌డ‌వాల‌ని ఆకాంక్షిస్తారు. అయితే ఆ పేరు పెట్టుకొని చెడ్డ పేరు తెచ్చే వారు కూడా లేక పోలేదు. అయితే ఆ పేరుతో వ్యవ‌హ‌రిస్తున్నప్పుడు మిగిలిన వారు.. ఆ చెడు న‌డ‌వ‌డిక ను హెచ్చరించాల‌న్నది ఆధ్యాత్మిక స్ఫూర్తి. అందుకే చెడ్డ పేరు తెచ్చుకోకురా బాబూ.. అని మంద‌లిస్తూ ఉంటారు. అలాగే పెద్ద వారి పేరు... పిల్లల‌కు పెడుతుంటారు. ఇది కూడా ఇదే కోవ‌లో అర్థం చేసుకోవాల్సిన సంగ‌తి.
నామ‌క‌ర‌ణం చేసేట‌ప్పుడు చ‌క్కగా ఇష్ట దేవ‌త‌ల్ని పూజిస్తారు. త‌ర్వాత దంప‌తులు శ్వేత బియ్యంలో ఆ పేరుని లిఖించ‌టం ఆన‌వాయితీ. అంతే గాకుండా పెద్ద వాళ్లతో ఆ పేరుతో మొద‌టగా పిల్లల్ని పిలిపిస్తారు. అప్పటినుంచి ఆ పేరుతో శిశువు వృద్ధి లోకి వ‌స్తాడ‌ని ఆశీర్వదిస్తారు.

Saturday 13 July 2013

జాత క‌ర్మ అంటే తెలుసునా..!

హైంద‌వ ధ‌ర్మం లో అనేక ప్రక్రియ‌లు ఉంటాయి. వీటి అర్థం తెలుసుకొంటే చాలా బాగుంటుంది.

శిశువు జ‌న్మించ‌గానే వెంట‌నే చేసే ప్రక్రియ ను జాత క‌ర్మ అంటారు. అంటే ప్రస‌వం అయిన‌ప్పుడు శిశువుని బ‌య‌ట‌కు తీసి బొడ్డును క‌త్తిరిస్తారు. ఈ స‌మ‌యంలోనే ఒక మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ జాత క‌ర్మ జ‌రిపించాల‌ని చెబుతారు.
** ప్రాంజ్నాది వ‌ర్ధనాత్ పుంసౌ జాత క‌ర్మ విధీయ‌తే-
మంత్రవ‌త్ ప్రాశ‌నం జాస్య హిర‌ణ్య మ‌ధు స‌ర్పిషామ్‌**
అని చెబుతారు. సువ‌ర్ణ పాత్ర లో తేనె లేక నెయ్యి వేసి  కుటుంబ ఆచారాన్ని అనుస‌రించి గృహ్య సూత్రం ప్రకారం వేద మంత్రాన్ని జ‌పిస్తూ ఈ ద్రవాన్ని నాకించాలి. దీంతో శిశువుకి తేజ‌స్సు, లావ‌ణ్యం క‌లుగుతుంద‌ని అర్థం. దీన్నే జాత క‌ర్మ అని పిలుస్తారు. ఈ మ‌ధ్య సిజేరియ‌న్ ఆప‌రేష‌న్ లు జ‌ర‌గుతుండ‌టంతో చాలా మంది దీన్ని మ‌రిచిపోతున్నారు. జాత క‌ర్మ చేయించాక కుటుంబ సాంప్రదాయాన్ని అనుస‌రించి నామ‌క‌ర‌ణ ఇత్యాదులు జ‌రిపించాలి

Thursday 11 July 2013

ఆధ్యాత్మిక‌త - ప్రాధాన్యం

తెలుగు వారి లోగిళ్లలో ఆధ్యాత్మిక‌త కు ఎంతో ప్రాధాన్యం ఉంది..  ఇంట్లో చిన్నారి పుట్టిన నాటి నుంచి పెద్దదై స‌మాజంలో ఒక స్థానం సంపాదించుకొనే దాకా ప్రతీ ద‌శ‌ను ఒక వేడుక‌లా చేస్తారు. ఈ వేడుక నిర్వహించ‌టం వెనుక అంత‌రార్థం ఉంది. దీనికి తోడు బాధ్యత‌ను గుర్తు చేసే ఒక విశిష్టత ఉంది. అందుకే ఈ వేడుక‌ల్ని మంత్ర పూర్వకంగా నిర్దేశించారు. ఈ మంత్రాల అర్థం తెలుసుకొంటే అద్భుతం అనిపిస్తుంది. జీవ‌నం ఎలా సాగించాలి అనే దాన్ని విడ‌మ‌ర్చి విశ‌దీక‌రిస్తుంటారు. అందుకే ఆధ్యాత్మిక‌త కు భార‌తీయ స‌మాజంలో అంత‌టి ప్రాధాన్యం..!

Wednesday 10 July 2013

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆత్మీయుల‌కు స్వాగ‌తం..!


భార‌తీయ సంప్రదాయం గురించిన విశేషాలు, ఆధ్యాత్మిక అంశాల్ని తేట తెలుగులో వివ‌రించాల‌న్నదే మా ప్రయ‌త్నం. ఆలోచ‌న‌లు పంచుకొనే వారంద‌రికీ ఆత్మీయ స్వాగ‌తం.